రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల రద్దు ఆలోచన విరమించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
రెండు నెలలవుతున్నా రైతులు ఇంకా కల్లాల్లోనే ఉండాలా అని సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సన్నవరి వేసి తాము తీవ్రంగా నష్టపోయామని ఓ మహిళ రైతు వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయుూబ్ ఖాన్, మండల అధ్యక్షుడు చిటమట రఘు, రైతులు పాల్గొన్నారు.