ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రజల ప్రయోజనాల కోసమే ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు. ఆదివాసుల హక్కులను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు.
జిల్లాలోని గోవిందరావుపేట మండలం పీహెచ్సీలో ఒక్క డాక్టరు మాత్రమే ఉన్నారని, ల్యాబ్ టెక్నీషియన్ లేరనే ప్రశ్నలు లేవనెత్తగా... త్వరలోనే భర్తీ చేస్తామని జిల్లా వైద్యాధికారి తెలిపారు. జిల్లాలో పండ్ల తోటలు, డ్రిప్ ఇరిగేషన్ తదితర అంశాలపై చర్చించారు.
కరోనా తర్వాత ప్రారంభమైన పాఠశాలల పనితీరు... తీసుకున్న జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. తాగు నీటి సమస్యలను అధికారులు క్షేత్ర స్థాయిలో తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎక్సైజ్ శాఖ పని తీరు ఉందని... బెల్టు షాపుల పేరుతో అక్రమార్కులు సిండికేట్ అయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పలు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సామాజిక మాధ్యమం ద్వారా పట్టభద్రుల ప్రచారంపై సుదీర్ఘ చర్చ