రమేశ్ హైదరాబాద్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం బొల్లికుంటకు చెందిన శుశ్రుతను ప్రేమించాడు. ఆమె హైదరాబాద్‌లో బీఫార్మసీ చేసే సమయంలో పరిచయమైంది. ఆ సాన్నిహిత్యమే ప్రేమగా మారి 2015లో వివాహం చేసుకున్నారు.
మొదట్లో బాగానే ఉన్నా... రమేశ్ కుటుంబ సభ్యుల ఒత్తిడితో భార్యతో గొడవపడే వాడని శుశ్రుత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ కారణంతోనే 8 నెలలక్రితం శుశ్రుత పుట్టింటికి వచ్చింది. గత శనివారం పుట్టింట్లో ఉంటున్న భార్య శుశ్రుతను రమేశ్ హైదరాబాద్‌కు రప్పించాడు. ఇద్దరు కలిసి ఘట్ కేసర్లోని బాహ్యవలయ రహదారి వద్దకు చేరుకోగా, గొడవ జరిగి కోపంతో శుశ్రుత, బాబు గొంతు నులిమి చంపేశాడు. ఆపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘట్కేసర్ బాహ్యవలయ రహదారికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రభాకర్ ఎన్క్లేవ్ పొదల్లో రమేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఘటన స్థలంలో పోలీసులకు శుశ్రుత, ఆమె కుమారుడి ఎముకలు, బూడిద మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడికి చేరుకున్న శుశ్రుత బంధువులు రమేశ్ ఒక్కడే ఈపని చేసి ఉండడని... అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించి ఉంటారని ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతని కాల్ డేటా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని శుశ్రుత తల్లి డిమాండ్ చేసింది.