రెవెన్యూ ఉద్యోగులపై ఫోన్లో దుర్భాషలాడిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద.. వారికి క్షమాపణలు చెప్పారు. దుండిగల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయిన ఎమ్మెల్యే.. క్షమాపణలు కోరినట్లు రాష్ట్ర ఎమ్మార్వోల సంఘం అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శి గౌతమ్ తెలిపారు.
మూడు రోజుల క్రితం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నంబర్ 79 అక్రమ నిర్మాణాలు వెలిశాయంటూ.. వాటిని కూల్చేశారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాలతో.. తెల్లవారుజామున గాజులరామారం వీఆర్వో శ్యామ్ కుమార్ అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. వారి ఇంట్లోని విద్యుత్ మీటర్లను తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వివేకానంద దృష్టికి తీసుకెళ్లారు బాధితులు. ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. సదరు వీఆర్వోపై ఫోన్లో దుర్భాషలాడారు. ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై.. వీఆర్వో శ్యామ్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలకు తహసీల్దార్ల సంఘం సిద్ధమైంది.
ఇవాళ.. దుండిగల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే వివేకానంద... సదరు ఘటనపై విచారం వ్యక్తం చేశారని.. క్షమాపణలు కోరినట్లు రాష్ట్ర తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శి గౌతమ్ తెలిపారు.
ఇవీచూడండి: వైరల్గా మారిన ఎమ్మెల్యే ఫోన్ సంభాషణ