మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని హెచ్ఎంటీ కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టగా.. ఈ ఘటనలో సందీప్, సోఫన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా సోఫన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దరించారు. సందీప్ పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వీరు చింతల్ నుంచి షాపూర్‌నగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిద్దరు షాపూర్ నగర్‌లోని ఓ ఇండస్ట్రియల్ క్యాంటీన్లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. బట్టలు కొనుక్కోడానికి చింతల్‌లోని ఓ బట్టల దుకాణానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: లారీని ఢీకొట్టిన సింగరేణి బస్సు.. నలుగురికి గాయాలు