కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా... చలివేంద్రం ఏర్పాటు చేశారు. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిలోని యమనంపేట కూడలిలో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పురపాలక సంఘం అధికారులు ఓ చలివేద్రం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్, స్టీలుపై వైరస్ కొన్ని గంటల పాటు బతికే ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా... అవే పాత్రలు ఉంచారు. నీళ్లు అందిస్తున్న సిబ్బంది సైతం చేతులకు తొడుగులు ధరించలేదు. నీటిని తాగడానికి ముందు ప్రజలు చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా ఎలాంటి ఏర్పాట్లు లేవు.
కరోనా వైరస్ ఉన్న వ్యక్తి ఒక్కరు నీళ్లు తాగినా... అతని ద్వారా ఎంతమందికి కొవిడ్-19 వ్యాపిస్తుందో తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య, పోలీసులు శాఖల అధికారులు దీనిపై స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.