Gun Firing at Shamirpet Celebrity Club : కుటుంబ కలహాలు కాస్త కాల్పులకు దారి తీశాయి. భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న మహిళ.. కుమారుడు, కుమార్తెను తన వద్దే ఉంచుకుంటోంది. తన పిల్లలను కొడుతున్నారని తన భార్యతో భర్త వాగ్వాదానికి దిగడం కాల్పులకు దారి తీసింది. దీంతో భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన వద్ద ఉన్న ఎయిర్‌గన్ తీసి కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా భయాందోళలకు గురైన భర్త పోలీసులను ఆశ్రయించాడు. కాల్పులకు సంబంధించిన వివరాలు కింద ఇలా ఉన్నాయి.
Shamirpet Gun Firing Case Update : ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన సిద్దార్థదాస్, ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్‌కు చెందిన స్మితాదాస్‌కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నేళ్ల క్రితం నుంచి దంపతులిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. తనకు విడాకులు కావాలంటూ స్మిత 2019లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భర్తతో ఇబ్బందులున్నాయంటూ తానుండే చోటుకి రాకుండా చూడాలంటూ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది. ఇద్దరు పిల్లల్ని తనే చూసుకుంటానని కోర్టును కోరింది. స్మితాదాస్ ఒత్తిడి, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారికి కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తుంది.
శంభో శివ శంభో, వినాయకుడు తదితర చిత్రాల్లో నటించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ఆమెను కౌన్సిలింగ్ సెంటర్‌లో కలిశాడు. స్మిత వద్ద కౌన్సెలింగ్ తీసుకునే క్రమంలో ఇద్దరూ దగ్గరయ్యారు. భర్తతో దూరంగా ఉంటున్న స్మిత మూడేళ్లుగా మనోజ్‌తో సహజీవనం చేస్తున్నారు. శామీర్‌పేటలోని సెలబ్రిటీ విల్లాలో మనోజ్ నివాసముంటుండగా.. ఇద్దరు పిల్లలు స్మిత దగ్గరే ఉంటున్నారు. స్మిత, మనోజ్ ఇద్దరూ కలిసి విజయవాడలో ఒక కార్యాలయం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.
Gun Firing at Shamirpet in Medchal : తల్లి స్మితదాస్‌తో సహజీవనం చేస్తున్న మనోజ్ తమను దారుణంగా వేధిస్తున్నాడని, నిత్యం కొడుతున్నాడంటూ ఆమె కుమారుడు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బాలల సంరక్షణ కమిటీకి గత నెల 12న ఫిర్యాదు చేశాడు. తన తల్లి బంధువుల దగ్గర కూడా ఉండలేనంటూ అధికారులకు వివరించిన్నట్లు తెలిసింది. అప్రమత్తమైన సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని రక్షించి.. సంరక్షణా గృహానికి తరలించారు. తన చెల్లిని కూడా మనోజ్ హింసిస్తున్నాడని బాలుడు అధికారులకు వివరించాడు. కుమార్తెతో కలిసి ఈ నెల 18న విచారణకు రావాలని సీడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులిచ్చారు. చెల్లిల్ని వేధిస్తున్న విషయాన్ని విశాఖలో ఉంటున్న తన తండ్రికి బాలుడు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చాడు. అసలేం జరుగుతుందో తెలుసుకుని.. కుమార్తెను తీసుకెళ్లేందుకు సిద్ధార్థదాస్ నిన్న తెల్లవారుజామున శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ విల్లాలో మనోజ్, స్మితా ఉంటున్న ఇంటికి వెళ్లాడు.
స్థానికులు తెలిపిన ప్రకారం.. ఉదయం బయటకు వచ్చిన స్మిత.. సిద్ధార్థను గమనించి ఇంట్లో ఉన్న మనోజ్‌కు విషయాన్ని చెప్పింది. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన మనోజ్ తన దగ్గరున్న ఎయిర్‌గన్‌తో బయటకొచ్చాడు. సిద్ధార్థను చంపేస్తానంటూ తుపాకీతో వెంటపడ్డాడు. భయపడిపోయిన సిద్ధార్థ అక్కడి నుంచి పరిగెత్తాడు. ఇదే సమయంలో మనోజ్ ఎయిర్‌గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. మనోజ్, స్మితను అదుపులోకి తీసుకుని ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.
మనోజ్ కాల్పులు జరిపాడా..? లేదా ? అనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు ఎయిర్‌గన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇన్నాళ్లూ తల్లి వద్ద ఉంటున్న 13 ఏళ్ల కుమార్తెను మేడ్చల్ జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులు.. ప్రభుత్వ గృహానికి తరలించారు.
ఇవీ చదవండి: