Four years Girl Kidnapped in Ghatkesar : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో కలకలం సృష్టించిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ ఒకటి వద్ద నిందితుడు సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు.. ఉదయం పాపను తీసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అప్పటికే చిన్నారి తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సురేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకున్నారు. పాపతో పాటు నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. సురక్షితంగా వారికి అప్పగించారు. గంటల్లోనే తమ బిడ్డను తమ వద్దకు చేర్చినందుకు బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
అసలు ఏం అయిందంటే..: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటున్న బాలిక కృష్ణవేణిని సురేశ్ (సూరీ) అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో సురేశ్ చిన్నారి ఇంటి సమీపంలో కూర్చుని ఉన్నాడు. అతడిని గమనించిన పాప తల్లి, నానమ్మ.. ఇక్కడెందుకు కూర్చున్నావంటూ సురేశ్‌ను ప్రశ్నించారు. ఊరికే కూర్చున్నా అంటూ దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే తచ్చాడాడు. అనంతరం పాప కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లగానే.. కృష్ణవేణిని అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో పక్కింట్లో ఉందేమోలే అనుకున్నారు.
"అప్పటిదాకా బయట ఆడుకుంటూనే ఉంది. ఉన్నట్టుండి పాప కనబడలేదు. పక్కింటిలో ఆడుకుంటుందేమోనని వెళ్లి అడిగితే అక్కడికి రాలేదని చెప్పారు. చుట్టుపక్కల అంతా వెతికాము. రైల్వేస్టేషన్ వైపు కూడా వెళ్లి చూశాం. ఎక్కడా కనిపించలేదు. సీసీ ఫుటేజ్‌లో చూస్తే.. ఒక వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు కనిపించింది. అతను ఎవరో కూడా మాకు తేలీదు. రాత్రి నుంచి మా పాప జాడ తెలియట్లేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం." -కృష్ణవేణి తల్లి
Girl Kidnap In Medchal : ఎంత సేపటికీ.. పాప ఇంట్లోకి రాకపోవడంతో పక్కింటి వాళ్లను అడిగారు. వారు తమ ఇంటికి రాలేదని చెప్పడంతో చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చిన్నారిని తీసుకెళ్లాడని చెప్పడంతో వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చారు. స్థానికుల సహాయంతో చిన్నారిని ఎటు తీసుకెళ్లాడు.. అతడు ఎలా ఉన్నాడు.. ఏ రంగు బట్టలు ధరించాడు తదితర వివరాలు కనుక్కున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు సురేశ్‌గా గుర్తించారు. బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేయగా.. ఈ ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
ఇవీ చదవండి: