ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాల మల్లేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజల్లో సీపీఐ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పేదల ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 7న జరిగే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డీజీ సాయిలు గౌడ్ పేర్కొన్నారు
పేదల హక్కులను కాలరాస్తున్నారు..
సర్వేనంబర్ 640, 641 ప్రభుత్వ భూముల్లో ఇళ్లు లేని పేద ప్రజలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. వారందరూ రెక్కాడితే గాని డొక్కనిండని కష్టజీవులని తెలిపారు. అలాంటి వారిపై గుండాలు, పోలీసులు దాడులు చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూకబ్జా దారులు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములకు దోచేస్తున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదోల్లు 40 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుంటే వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు.
జీవోలు అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 58, 59 జీవోలు అమలు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, టి.శంకర్, ఎస్.వెంకట్ రెడ్డి, మూడు చింతపల్లి మండల కార్యదర్శి టి.రాములు గౌడ్, ఆదివాసుల సంఘం జాతీయ నాయకులు శంకర్ నాయక్, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి వెంకట చారి, అల్వాల్ మండల కార్యదర్శి కె.సహదేవ్, సహాయ కార్యదర్శి డి.జంగయ్య, గుడిసె వాసుల నాయకులు రేణుక, లక్ష్మి, శంకరమ్మ, శంకర్ పాల్గొన్నారు,
ఇదీ చూడండి: