మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన 'రెడ్ల సింహగర్జన సభ'లో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి ఘటనలో పలువురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రిపై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని తెరాస నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తెరాస నేతలు చేసిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
మేడ్చల్ జిల్లా జిల్లా ఘట్‌కేసర్‌లో రెడ్ల ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సింహగర్జన కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి హాజరు కాగా.. తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సభికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. మంత్రి ప్రసంగాన్ని పలువురు నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
ప్రసంగంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి.. తెరాస సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో మళ్లీ తెరాస ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమాం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను పొగుడుతూనే.. మంత్రి ఉపన్యాసం సాగింది. అయితే.. ప్రసంగంలో మంత్రి పదేపదే కేసీఆర్, తెరాస గురించి ప్రస్తావించటంతో.. తీవ్ర ఆగ్రహంతో కుర్చీలు పైకి లేపి సభికులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న దళితబంధు లాగానే రెడ్లబంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 వేల కోట్లతో రెడ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నినదించారు. అంతటితో ఆగకుండా.. మంత్రిపైకి చెప్పులు, రాళ్లు విసిరేసి గందరగోళం సృష్టించారు.
ఈ ఊహించని పరిణామంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సభ నుంచి వెనుదిరిగారు. వెళ్లిపోయే క్రమంలోనూ మంత్రి కాన్వాయ్‌పై రెడ్డి నేతలు దాడి చేశారు. కాన్వాయ్ వెనుక పరుగులు తీస్తూ మరీ.. నీటి సీసాలు, కుర్చీలు, రాళ్లు విసరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రి కాన్వాయ్‌కు రక్షణగా నిలిచారు. అతికష్టం మీద మంత్రి మల్లారెడ్డిని నిరసకారుల నుంచి తప్పించిన పోలీసులు.. సభా ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
స్పందించిన మంత్రి మల్లారెడ్డి: రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో తనపై దాడి ఘటనపై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనపై దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. ఆయన ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాననే అక్కసుతో తన అనుచరుల ద్వారా దాడి చేయించారని అన్నారు. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
ఎవరినీ ఉపేక్షించం: మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు సరికాదన్నారు. ఆదివారం మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన రెడ్ల సింహగర్జన సభకు అనుమతులు ఇప్పించి సహకరించిన మల్లారెడ్డిపైనే దాడి చేయడమేంటని ప్రశ్నించారు. వేదికపై మంత్రి అన్ని విషయాలు చెప్పారని తెలిపారు. సభలో ఆ ఒక్క విషయమే చెప్పాలా? రెడ్డి కార్పొరేషన్ గురించే మాట్లాడాలని అనడం సబబుకాదని మండిపడ్డారు. ఓ బాధ్యత గల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారని వివరించారు. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం చేసిన అంశాలను వివరించారని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరినీ ఉపేక్షించమని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: