మెదక్ జిల్లాలోని వెల్దుర్తికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన కట్టడాలే ఇందుకు నిదర్శనం. వెల్దుర్తి గ్రామ పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది. క్రీ.శ.1162లో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు వెల్దుర్తిలో ఆలయాలతోపాటు విజయ స్తూపం, ద్వీప స్తంభాలు వంటి ఎన్నో కట్టడాలను నిర్మించారు. సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న సింహ ద్వారం వీటిల్లో ప్రధానమైనది. ఈ నిర్మాణంపై ఉన్న ఆరు రంధ్రాల నుంచి ఒక్కో రుతువులో ఒక్కో రంధ్రం ద్వారా ఉదయపు సూర్య కిరణాలు వెళ్లి సింహ ద్వారానికి ఎదురుగా ఆలయంలో కొలువైన పద్మనాభస్వామి నాభిపై పడడం విచిత్రం. కాకతీయుల కాలంలో వెల్దుర్తిని ‘వెలుతురు’గా పిలిచేవారని కాలక్రమేణా అది ఎల్దుర్తి, ఎలుదుర్తి, యెల్దుర్తి నుంచి ప్రస్తుతం ప్రజల వాడుకలో వెల్దుర్తిగా ప్రసిద్ధి పొందింది. ఆలయ పరిసరాల్లోనే 50 అడుగుల ఎత్తు ఉన్న విజయ స్తూపం, 20 అడుగుల ఎత్తు ఉన్న ద్వీప స్తంభాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. కాకతీయుల కాలంలో ఓ వైపు సింహ ద్వారం మరోవైపు ఆలయంలో శివుని విగ్రహం ఉండేదని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో శివుని విగ్రహం తొలగించి పద్మనాభస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, ఇక్కడి విజయ స్తూపంపై గతంలో శివుని విగ్రహం ఉండేదని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో గరుత్మంతుని విగ్రహం ప్రతిష్ఠించారని గ్రామపెద్దలు తెలిపారు. అలాగే వీటి పక్కనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన విఠలేశ్వరాలయం ఉంది. దీని పరిసరాల్లో నటరాజ, నంది, గణపతి, ఇతర విగ్రహాలు ప్రస్తుతం శిథిలమై ఉన్నాయి. సింహ ద్వారం, ద్వీప స్తంభాలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ దేవాలయానికి దగ్గరలోనే కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన చెరువు ఉంది. దీనిని అప్పట్లో గుడి కుంటగా పిలిచేవారని కాలక్రమేణ కుడి చెరువుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ చెరువు ఆయకట్టు 250 ఎకరాల వరకు ఉంది.
ఇదీ చదవండి: వధువు మృతి.. ఆమె సోదరిని పెళ్లాడిన వరుడు