కరోనా వైరస్ ప్రభావం కారణంగా.. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనులు చేయడానికి ప్రజలు భాగీగా ముందుకొస్తున్నారు. ఈ అంశమై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులైన అందరికీ పని కల్పించడం.. చెల్లింపులూ వేగంగా జరిగేలా చొరవ తీసుకుంటున్నారు. తపాలా శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
రాష్ట్రంలోనే అగ్రస్థానం
మెదక్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈనెల 8 నుంచి 15 వరకు చెల్లింపులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వారం రోజుల వ్యవధిలోనే రూ.3.31 కోట్లు కూలీలకు అందాయి. ఉపాధి హామీ కూలీల డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమచేసి.. తపాలా శాఖ నుంచి పంపిణీ చేస్తుంటారు. బ్యాంకు ఖాతాలతో పోలిస్తే తపాలా శాఖ ద్వారా తీసుకునే వారి సంఖ్య తక్కువే ఉంటుంది.
- కరోనా నేపథ్యంలో తపాలా శాఖ నుంచి కూలి డబ్బులను త్వరితగతిన పంపిణీ చేయడంలో జాప్యం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
- ఎప్పటికప్పుడు కూలి డబ్బులు అందించేలా చొరవ తీసుకున్నారు. తపాలా సిబ్బందితో పాటు కూలి డబ్బుల కోసం వచ్చేవారికి శానిటైజర్లు, మాస్క్‌లు అందించారు. కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
రోజూ లక్షకు పైగానే..
కరోనా కాలంలో ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా వాడుకుంటున్నారు. గతంలో రోజువారీ కూలీల సంఖ్య 65 వేలకు మించకపోయేది. ఇప్పుడు అది 1.15 లక్షలకు చేరింది. జాబ్‌కార్డు ఉండి పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపించేలా పక్కా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పనులను కల్పించే అంశంలో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: ఏపీ జీవోపై... జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు