మెదక్ కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హాజరయ్యారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలు, తండాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని.. వాటిని పూర్తిగా నిలిపివేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. దీనికి గాను గ్రామాల్లో ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను అర్థమయ్యేలా వివరించాలన్నారు.
చిన్నతనంలోనే వివాహం చేస్తే వారి మానసిక స్థితి ఎదగకపోవడం వల్ల సమస్యలు రావడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే గ్రామాలు, తండాల్లోని పాఠశాలల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు తెలియజెప్పి వారి తల్లిదండ్రులకు వివరించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తతెత్తకుండా మెదక్ జిల్లాలో సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. దీనికి అవసరమైన ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గర్భిణులు, బాలింతలు, బాలికలతో పాటు చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డీఎస్పీ కృష్ణమూర్తి, ఐసీడీఎస్ సీడీపీవోలు పద్మావతి, హేమభార్గవి, భార్గవి, స్వరూప, సఖి సెంటర్ బాధ్యులు పద్మలత, కరుణశీల, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పరీక్షలు పెంచండి.. ఈటలతో మజ్లిస్ ఎమ్మెల్యేలు