వానాకాలం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచినా... మెదక్ జిల్లాలో ఉన్న ఘన్పూర్ ఆనకట్టు నీరు లేక వెలవెలబోతోంది. మంజీరా నది మీద కొల్చారం మండలం చిన్న ఘన్పూర్ వద్ద ఆనకట్టను నిర్మించగా... దీని కింద 21,265 ఎకరాల ఆయకట్టు ఉంది. ఘన్పూర్ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు కాగా... ఏటా యాసంగి సీజన్లలో ఆయకట్టు రైతుల అవసరాన్ని బట్టి సింగూరు ప్రాజెక్టు నుంచి దశలవారీగా నీటిని విడుదల చేస్తారు. అక్కడి నుంచి నీరు వస్తేనే ఘన్పూర్ ఆయకట్టులో పంటలు సాగు చేయగలుగుతారు. లేకుంటే పొలాలు బీడు వారాల్సిందే.
ఈసారి వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా... జిల్లాలో భారీ వర్షాలు కురిసినా... మహబూబ్నహర్, ఫతేనహర్ కాలువలు నీటి ప్రవాహం లేక నిస్తేజంగా మారాయి. పర్యవసానంగా ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాలు బీడు వారుతున్నాయి. ఆయా మండలాల పరిధిలో బోర్ల వసతి ఉన్నా.. నీళ్లు అందక కొందరు రైతులు తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగు చేస్తున్నారు.