మెదక్ జిల్లా నర్సాపూర్ లంచం కేసులో నిందితులను అనిశా కస్టడీకి కోర్టు అనుమతించింది. చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు అదనపు కలెక్టర్ నగేశ్ లంచం డిమాండ్ చేశాడు. నగేశ్‌తో సహా మిగితా నలుగురిపై అనిశా అధికారులు న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఎకరాకి లక్ష చొప్పున మొత్తం రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎన్ఓసీ జారీచేసేందుకు నగేశ్‌తో పాటు సిబ్బంది బాధితుడిని ఇబ్బందిపెట్టగా... విసిగిపోయి ఫోన్‌సంభాషణను అనిశా ముందుంచాడు.
లంచం డిమాండ్..
చందానగర్‌కు చెందిన లింగమూర్తి... మరో నలుగురితో కలిసి భూమి కొనుగోలు చేసేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రం పొందే క్రమంలో ఇబ్బందులు మొదలయ్యాయి. జులై 21న నర్సాపూర్ తహసీల్దార్‌కు దరఖాస్తు చేయగా... అది ఆర్డీఓ అరుణా రెడ్డి నుంచి అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డికి జులై 25న చేరింది. జులై 30న లింగమూర్తి నగేశ్‌ను కలవగా లంచం డిమాండ్ చేశాడు.
ఎన్ఓసీ..
దీనిలో భాగంగా జులై 31న నగేశ్ ఇంట్లో రూ. 19లక్షల 50వేలు అందజేశారు. ఈ దస్త్రం చూస్తున్న అధికారులకూ లంచం ఇవ్వాలని నగేశ్ ఆదేశించగా రూ. 4 లక్షలు సర్వేయర్ వసీంకు, మరో రూ. లక్ష రాజీవ్‌కు బదిలీ చేశాడు. తర్వాత రెండో దఫాగా ఆగస్టు 1న అదనపు కలెక్టర్ నగేశ్‌కు రూ. 20 లక్షల 50 వేలు చెల్లించాడు. కరోనా కారణంగా మిగిలిన రూ. 72 లక్షలు సమకూర్చడం కష్టమైందని లింగమూర్తి నగేశ్‌కు తెలిపాడు. దీంతో 8 చెక్కులు తీసుకొని నగేశ్ ఎన్ఓసీ అందజేశాడు.
ఫోన్ రికార్డు..
మిగతా డబ్బు అందకపోవడంతో సర్వేతోపాటు, రికార్డు సరిచేసే పనులను పెండింగ్‌లో పెట్టాడు. విసిగిపోయిన లింగమూర్తి నగేశ్ ఫోన్ సంభాషణ రికార్డు చేశాడు. మిగిలిన లంచం బదులు వారు కొన్నభూమిలో పదెకరాలు తనకు రిజిస్ట్రేషన్ చేయమని నగేశ్ డిమాండ్ చేయగా... ఐదెకరాలకు ఒప్పందం జరిగింది. తనతో పాటు కలెక్టర్‌కు, కిందిస్థాయి ఉద్యోగులకూ డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన లింగమూర్తి అనిశా అధికారులను కలిసి ఆధారాలు సమర్పించారు.
ఈనెల 21 నుంచి 24 వరకు అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, బినామీ జీవన్‌గౌడ్‌లను అనిశా విచారించనుంది. వీరందరినీ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.