రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రూ.4 కోట్ల 20 లక్షలతో పిల్లి కోటల వద్ద నిర్మిస్తున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు శంకుస్థాపన చేశారు. నర్సాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. పసుపులేరు ఒడ్డున శివాలయం వద్ద స్వచ్ఛభారత్ సృష్టికర్త సంత్ గాడ్గే బాబా విగ్రహాష్కరణలో పాల్గొన్నారు. గిద్దకట్ట వద్ద అధునాతన దోబీఘాట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి.. రాందాస్ చౌరస్తాలో రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాన్ని ప్రారంభించారు.
వెయ్యి కోట్లతో తండాల్లో పంచాయతీ భవనాలు
గిరిజనులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని తండాల్లో రూ.600 కోట్లతో 2,500ల గ్రామ పంచాయతీలకు భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. మెదక్‌లో మూడు గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు.
రజకులకు అధునాతన ధోబీ ఘాట్లు
రజకులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో కోటి 50 లక్షల రూపాయలతో అధునాతన యంత్రాలతో ధోబీ ఘాట్ నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ కోసం రూ.300 కోట్లు కేటాయించామని..అంకే కాకుండా 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామన్నారు. మెదక్‌లో రజకుల కమ్యూనిటీ హాల్ కోసం రెండు ఎకరాలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కోటి రూపాయలతో జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయం, బీమా వర్తింపుపై సీఎంతో మాట్లాడుతానని మంత్రి హామీనిచ్చారు.
'మెదక్ జిల్లాకేంద్రంలో వసతి గృహం మంజూరు చేశాం. ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీ కూడా ఇచ్చాం. ఎస్టీల విషయంలో తండాలకు బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించాం. రాష్ట్రంలోని అన్న తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకున్నాం. వెయ్యి కోట్ల రూపాయలతో భవనాలు, రోడ్లు నిర్మిస్తాం. మెదక్ జిల్లాలో మూడు రెసిడెన్షియల్ పాఠశాలల కేటాయించాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు మంజూరు చేస్తున్నాం. మెదక్‌లో ఇవాళ శంకుస్థాపన చేశాం. రజకుల ఇబ్బందులు పడకుండా అధునాతన ధోబీ ఘాట్‌కు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. - హరీశ్ రావు, మంత్రి
జాగా ఉంటే రూ.3 లక్షలు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సొంతింటి జాగాలో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అల్లాదుర్గ్ బాధితులను ఆదుకుంటాం
అల్లాదుర్గ్‌లో ప్రమాదవశాత్తు చనిపోయిన రజక కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 550 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. గత కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో మూడే మెడికల్ కాలేజీలు ఉంటే.. ఆరేళ్లలోనే 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో రజకుల కృషి ఎనలేనిదని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో మెదక్ జిల్లాలో 1149 పోస్టులు ఉన్నందున యువతకు ఉద్యోగాల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారని.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: Harish Rao About Budget 2022-23 : 'కొత్తగా ఏర్పడినా.. తెలంగాణ దేశానికే ఆదర్శం'