విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం నుంచి పాఠశాలల్లో ప్రత్యేక ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నందున మెదక్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఈవో రమేశ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, విద్యా శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సెప్టెంబర్ 1నుంచి ప్రభుత్వం టీ-శాట్, దూరదర్శన్ యాదగిరి ఛానళ్ల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ క్లాసులకు బడి పిల్లలంతా హాజరయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటుందని.. విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్లైన్ తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్న అపోహలు, అపనమ్మకాలను తొలగించి వారిలో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థులు సైతం ఆన్లైన్లో క్లాసులు చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి కోరారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు జరగాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
ఆన్లైన్ క్లాసులు నిర్వహణకు ప్రతి పది మంది విద్యార్థులకు ఒక కేర్ టీచర్ ఉండాలని సూచించారు. మెదక్ జిల్లాలో 64,308 విద్యార్థులు చదువుతుండగా వారిలో 6,643 (10.3 శాతం) మందికి టీ-శాట్, దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ఆన్లైన్ పాఠాలు వినే సౌలభ్యం ఉన్నట్లు మంత్రి వివరించారు. టీ-శాట్, దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ఆన్లైన్ ద్వారా పాఠాలు వినే సౌకర్యం లేని విద్యార్థుల గురించి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎస్ఏంసీ ఛైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు. గ్రామాలు, పట్టణాల్లోని సమీప ఇళ్లల్లో ఇంటర్నెట్, టీవీ వంటి సౌకర్యాలు ఉంటే వేరే ఇళ్ల వారితో సమన్వయం చేసుకొని విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాలని.. గ్రామపంచాయతీల ద్వారా పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
అలాగే విద్యార్థులందరికీ నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్ చేరేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. ఆన్ లైన్ తరగతుల నిర్వహణలో విద్యార్థుల తల్లిదండ్రులను, స్థానిక యువతను భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరారు. ఆరో తరగతి ఆపైన చదువుకుంటున్న విద్యార్థులకు రికార్డెడ్ పాఠాలు అందుబాటులో ఉంచాలని.. ఐదో తరగతి లోపు విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ విషయంలో అవసరమైన చర్యలుతీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే ఎక్కువగా ఉంటారని... ఈ విషయంలో విద్యార్థులకు ఎవరికి కూడా ఆన్ లైన్ క్లాసులు ఇబ్బందులు ఉండకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అలాగే కేర్ టీచర్ పని తీరును జిల్లా విద్యాశాఖ అధికారి, హెడ్ మాస్టర్స్ ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు కేర్ టీచర్లు ప్రతి వారంలో రెండు రోజులు వారి ఇంటి వద్దకు వెళ్లి నోట్స్, ఆన్ లైన్ ద్వారా వారు తెలుసుకున్న విషయాలను పునశ్చరణ చేయించాలన్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా టీవీలు, ఫోన్లు లేని విద్యార్థుల వివరాలను సేకరించారా ? ఈ విషయంలో ఎలాంటి సర్వే చేశారు ? అని విద్యాశాఖ అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఆన్లైన్ తరగతులలో జిల్లాలోని విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే వారి సమస్యలు తెలిపేలా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్, ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్' రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు