వచ్చే ఆర్ధిక సంవత్సరంలో (2021-22) సామర్థ్య రుణ ప్రణాళిక ద్వారా ప్రాధాన్యతా రంగాలకు రూ. 2,627.9 కోట్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సాయిరాం, ఆర్.బి.ఐ. లీడ్ బ్యాంక్ అధికారి శరత్ చంద్ర, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ సెసిల్ తిమోతి, మెదక్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్ రావు సంయుక్తంగా సామర్థ్య రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
పంట రుణాలకు ప్రాధాన్యత
2020-21లో రుణ ప్రణాళిక అధికంగా రూ.2,217. 28 కోట్లు కాగా ఈ ఏడాది 18 శాతం ఎక్కువగా రూ. 2,627.9 కోట్లను రుణంగా అందించాలని నిర్ణయించుకున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తం ప్రణాళికలో 55 శాతం (1,445. 30 కోట్లు) ప్రధానంగా పంట రుణాలేనని పేర్కొన్నారు. టర్మ్‌లోన్ కింద వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడిపరిశ్రమ, మేకలు, గొర్రెల పెంపకం, వ్యవసాయ యాంత్రీకరణ భూమి అభివృద్ధి, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు, నీటి వనరులకు 23.88 శాతం అనగా రూ.627.36 కోట్లు, సూక్మ, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పడానికి రూ.389.35 కోట్లు కేటాయించామని అన్నారు. ఇతర ప్రాధాన్యత రంగాలైన గృహ నిర్మాణం, విద్య, మౌలిక వసతుల కల్పన మెుదలైన వాటికి రూ.165.05 కోట్లు అందించాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు