హరితహారంలో భాగంగా అటవీ పునరుజ్జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ ప్రాంతంలో మొక్క నాటి ఆరోవిడత హరితహారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఉదయం 11:30 నిమిషాలకు కేసీఆర్ నర్సాపూర్ చేరుకుంటారు. అటవీ శాఖ అభివృద్ధి చేసిన అర్బన్ పార్కును ప్రారంభించి.. నేరేడు మొక్క నాటనున్నారు. అనంతరం పార్కులో ఎత్తైన గుట్టపై ఏర్పాటుచేసిన 60 అడుగుల వాచ్‌టవర్ అటవీ అందాలు వీక్షిస్తారు.
ఎవరూ రావొద్దు..
కరోనా నేపథ్యంలో జనసమీకరణ, బహిరంగ సభ లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పరిమితంగానే హాజరవుతున్నారు. సీఎంతో పాటు కేవలం 8 మంది ప్రముఖులు మాత్రమే మొక్కలు నాటనున్నారు. నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి రావొద్దని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ప్రజలు, పార్టీ శ్రేణులు ఇళ్ల వద్ద మొక్కలు నాటి కేసీఆర్‌కు సంఘీభావం తెలపాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
అడగడుగునా అప్రమత్తం
ముఖ్యమంత్రి పర్యటన అటవీ ప్రాంతంలో ఉండటంతో భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ ఎస్పీ చందన దీప్తీ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బాంబ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు అడవిని జల్లెడ పట్టాయి. 12 జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. నర్సాపూర్-హైదరాబాద్ మార్గాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసి వేయనున్నారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను దారిమళ్లించనున్నారు.
బహిరంగ సభ లేకపోవడం వల్ల.. మొక్కలు నాటిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఇవీచూడండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. నేడే శ్రీకారం