నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బోర్లలో భూగర్భజలం అడుగంటడంతో పాటు శుద్ధి జల కేంద్రాలు మూతపడ్డాయి. ఇక ఆసుపత్రికి వచ్చే రోగులతోపాటు వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. వైద్యశాల ఆవరణలో ఉన్న ఒక్క బోరు గంట సేపు నీరందిస్తే అదే మహాప్రసాదంగా భావించాల్సి వస్తోంది.
100 పడకల ఆసుపత్రి కావడం వల్ల నిత్యం నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, హత్నూర, కొల్చారం, చిలప్‌చెడ్, వెల్దుర్తి మండలాలతో పాటు పక్క తూప్రాన్, మనోహరాబాద్, గుమ్మడిదల, జిన్నారం మండలాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.
శుద్ధి జల యంత్రాలు మూలకు...
రోగులకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి ఏర్పాటు చేసిన శుద్ధి జల యంత్రాలు నిరుపయోగంగా మారాయి. కొన్నేళ్లుగా వీటిని పట్టించుకోపోవడం వల్ల దుమ్ముపట్టి పోతున్నాయి. ప్రారంభంలో కొంతకాలం బాగానే పనిచేసినా ఆ తర్వాత మరమ్మతులకు రావడం వల్ల పట్టించుకోలేదు. శుద్ధి జల యంత్రాలకు ప్రత్యేకంగా గదిని కేటాయించినప్పటికీ నిర్వహణ వదిలేయడంతో మూలకే పరిమితం అయ్యాయి.
లాక్‌డౌన్‌తో ఇక్కట్లు...
ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ సురేశ్‌బాబు విన్నపం మేరకు పట్టణంలోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం నిత్యం 20 డబ్బాల నీటిని అందించేవారు. కళాశాల సిబ్బంది ఆటోలో తెచ్చి ప్రధాన ద్వారం, రోగుల వార్డుకు సమీపంలో రిఫ్రిజ్‌రేటర్లలో పోసేవారు. దాంతో వైద్యులు, సిబ్బంది గొంతు తడిసేది. లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా కళాశాలల మూతపడటం వల్ల మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. తాగునీటికి రోగులు, సిబ్బంది, వైద్యులు నానా అగచాట్లు పడుతున్నారు.
శౌచాలయాల నిర్వహణా కష్టమే...
కొన్ని నెలలుగా వైద్యశాలలో నీటి సమస్య ఉన్నా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం వల్ల బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులకు సమస్యగా మారింది. ఆసుపత్రి అవసరాలకు ట్యాంకర్ల ద్వారా సంపు నింపుతున్నారు. అత్యవసర సమయాల్లో ట్యాంకరు రాకపోతే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో శౌచాలయాల నిర్వహణ కష్టమవుతోంది.
ఉన్నతాధికారులకు నివేదించాం...
ఆసుపత్రిలో నెలకొన్న నీటి సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించాం. కొత్తగా బోరు వేసినా నీరు పడే అవకాశాలు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లతో సరఫరా చేయిస్తున్నాం. తాగడానికి కొద్దిరోజులపాటు స్థానికంగా శుద్ధిజలం కేంద్రం నుంచి నీళ్లు తెప్పించాం. ప్రస్తుతం ఆ నీటి సరఫరా కూడా నిలిచిపోయింది.
- డాక్టర్ సురేశ్‌బాబు, ఆసుపత్రి పర్యవేక్షకులు