సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు విని నియంత్రిత సాగు విధానం ప్రకారం సన్న రకాలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. నష్టపోయిన రైతులందరిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని వరి పంటలను పార్టీ నాయకులు సందర్శించారు.
అనంతరం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. జిల్లాలో వరి పంట తీవ్రంగా నష్టపోయిందని మల్లేశం తెలిపారు. ముఖ్యంగా సన్నరకానికి దోమపోటు, కాటిక రోగం సోకటం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే పంటనష్టాన్ని సర్వే చేసి అంచనా వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.