CM KCR Medak Tour Today : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మెదక్ జల్లా ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు దగ్గరుండి చూసుకున్నారు. మెదక్ వేదిక నుంచే రానున్న ఎన్నికలకు కేసీఆర్ శంఖారావం పూరించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఇదే వేదికగా.. ఆసరా పింఛను పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
CM KCR Medak Tour Schedule : మెదక్ సమీకృత కలెక్టరేట్ నూతన భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. కలెక్టరేట్‌తో పాటు ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రగతి నివేదన సభలో రెండు కొత్త కార్యక్రమాల ప్రారంభం కూడా సీఎం చేయనున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించిన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేసీఆర్.. రోడ్డుమార్గాన గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 1:20 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 1:40గంటలకు సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
అనంతరం వికలాంగుల ఆసరా పింఛను(Disability Support Pension) రూ.4,016/- పెంపు కార్యక్రమాన్ని మెతుకుసీమ వేదికగా సీఎం ప్రారంభిస్తారు. వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపుతో పాటు టెకేదార్లు, ప్యాకర్స్‌కు పింఛన్లు ఇచ్చే కార్యక్రమంను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చర్చ్ కాంపౌండ్‌లో లక్షమందితో జరగనున్న బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.
"మెదక్ పట్టణంలోని కొంత మంది దివ్యాంగులకు కేసీఆర్ చేతులు మీదుగా పెంచిన రూ.4,016/- ఆసరా ఫించన్‌ను ఇవాళ అందించనున్నారు. 16 రాష్ట్రల్లో బీడీలు చేసే కార్మికులు ఉన్నా.. ఇవాళ వారికి పెన్షన్ ఇస్తూ ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే. బీడీ కార్మికులతో పాటు టెకేదార్లు, ప్యాకర్స్ చేసిన విజ్ఞప్తి మేరకు వారికి కూడా ఆసరా ఫించన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు." - హరీశ్‌రావు, ఆర్థికమంత్రి
మెదక్ నుంచి ఎన్నికల శంఖారావం : రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని.. బీజేపీ డీలా పడిపోయిందని మంత్రి హరీశ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే అన్ని వర్గాలకు మేలుచేసేలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలిసారిగా మెదక్‌లో జరగుతున్న బహిరంగసభకు హాజరవుతున్న బీఆర్ఎస్ అధినేత.. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. బుధవారం మెదక్‌లో జరిగే సీఎం బహిరంగ సభకు పెద్ద ఎత్తున్న ప్రజలు, శ్రేణులు హాజరుకావాలని మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
"ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించినటువంటి పార్టీ గత చరిత్రలో ఎప్పుడూ లేదు. మా కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేనిది. కేసీఆర్ వ్యూహానికి ఈవేళ విపక్షాలన్నీ కకావికలం అవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి క్యాడర్ లేదు..కాంగ్రెస్‌కు క్యాండిడేట్లు లేక టికెట్లు అమ్ముకుంటుంది. అన్ని వర్గాలను ఆదుకున్న ఒకే ఒక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మన తెలంగాణ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది. పక్క రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాలను కాపీ కొడుతుంది." - హరీశ్‌రావు, ఆర్థికమంత్రి
BRS Party Campaign Strategy 2023 : హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ!