మంచిర్యాల జిల్లాలోని పాఠశాలల్లో చదువులు సాగుతున్న తీరు, ఉపాధ్యాయుల హాజరు, బడుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను రోజువారీగా పర్యవేక్షించడంలో మండల విద్యాధికారుల పాత్ర కీలకం. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల బాధ్యతలు ఎంఈఓలు పర్యవేక్షిస్తే ఉన్నత పాఠశాలల బాధ్యతను ఉప విద్యాధికారి చూసుకోవాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో చాలా ఏళ్లుగా ఆ పోస్టులు భర్తీ కావడం లేదు.
లోపిస్తున్న పర్యవేక్షణ
మంచిర్యాల జిల్లాలోని 711 ప్రభుత్వ పాఠశాలల్లో 42,483 మంది విద్యార్థులున్నారు. మండల విద్యాధికారులు రోజువారీగా ఏదో ఒక పాఠశాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఇది అమలు కావడం లేదు. పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం నివేదికలు తయారు చేయించడం, వారికి వేతనాలు చెల్లించడం, విద్యార్థుల సమగ్ర స్వరూప వివరాలు తీసుకోవడం, విద్యా వాలంటర్ల్ల వేతనాల బిల్లులు, విద్యాశాఖకు సంబంధించి అన్ని పనులు చేయాలి. జిల్లాలోని చాలా పాఠశాలల్లో మండల విద్యాధికారుల పర్యవేక్షణ లోపించింది.
అదనపు బాధ్యతలతో అవస్థలు
జిల్లాలోని ఆయా మండలాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోల బాధ్యతలు అప్పగించారు. వీరు పాఠశాల విధులను చూస్తూనే అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. కొంత కాలంగా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించక పోవడం వల్ల ఎంఈవో పోస్టులు భర్తీ కావడం లేదు. ఎవరైనా పదవీ విరమణ పొందితే ఆ మండల బాధ్యతలను సైతం పక్క మండలాల అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించడమే తప్ప కొత్తగా నియామకాలు చేయడం లేదు. దీనివల్ల పాఠశాలల్లో మండల విద్యాధికారుల పర్యవేక్షణ కొరవడింది.
భర్తీ చేస్తేనే మనుగడ
జిల్లాలోని చాలా పాఠశాలల్లో తరగతి గదుల కొరత, వంట గదులు, మూత్ర శాలలు, మరుగుదొడ్లు, తాగునీటి ఇబ్బందుల సమస్యలతో ఏటా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.పదోన్నతలు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలల మనుగడ సాధ్యమవుతుందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.
- ఇదీ చూడండి : గుత్తేదారుల నిర్లక్ష్యంతో నాసిరకం పనులు