పాఠశాల ప్రారంభం నుంచి ఒకదాని తర్వాత మరొక తరగతి వెనువెంటనే ఉంటాయి. ఇంటర్వెల్, మధ్యాహ్నా భోజన సమయాల్లో తప్పా.. నీరు తాగేందుకు అసలు విద్యార్థులకు సమయమే దొరకడం కష్టం. ఫలితంగా మార్కుల సంగతేమో గాని వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. బాల్య దశలో తీసుకోవాల్సిన రెండు నుంచి మూడు లీటర్ల నీటిని కూడా వారు తాగేందుకు సమయం దొరకడం లేదు. చిన్నతనంలోనే మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఏకాగ్రత సైతం దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వాటర్ బెల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది మంచిర్యాల జిల్లా యంత్రాంగం. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా చూడాలని కలెక్టర్ భారతి హోలీకేరి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
రోజుకు 16 గ్లాసులు
శరీరానికి సరిపడినంత నీరు అందకపోతే, చర్మ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో పాటు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిఫుణులు, విద్యావంతులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు రోజుకు 16 గ్లాసులు నీరు తాగితే ఆరోగ్యంతో పాటు, ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. నీటిగంట కార్యక్రమం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచే వాటర్ బెల్ (నీటి గంట) కార్యక్రమం అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అందుకు ఉపాధ్యాయులు సైతం సమాయత్తమయ్యారు. కొన్ని చోట్ల మాత్రం పూర్తిస్థాయిలో ఇంకా ప్రారంభం కాలేదు. అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని తల్లిదండ్రులు, వైద్యులు కోరుతున్నారు.