సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 132 స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, పండిత్‌ల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎస్జీటీల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఈ నియామక ప్రక్రియ పూర్తిచేయనున్నారు.
ఎట్టకేలకు భర్తీ
సర్కారు బడుల్లో సబ్జెక్టు ఉపాధ్యాయలులేక విద్యార్థుల ప్రవేశాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్య దశకు చేరుకుంటున్నాయి. అందుకే డీఎస్సీ స్థానంలో టీఆర్‌టీ ఉపాధ్యాయుల నియామక బాధ్యతను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించింది. వీటికి సంబంధించిన ఫలితాలు ఇది వరకే విడుదలైనా అభ్యర్థులకు నియామకపత్రాలు అందించకపోవడం వల్ల టీఆర్‌టీ నియామక అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలకు దిగారు. ఎట్టకేలకు ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి పోస్టులు మాత్రమే భర్తీ చేస్తోంది. పీఈటీలకు సంబంధించి ఉర్దూ మాధ్యమంలో రెండు పోస్టులను కేటాయించినా.. ఎవరూ నియామకం కాకపోవడంతో అభ్యర్థుల వివరాలను పంపించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ప్రాధాన్య క్రమంలో కేటాయింపు
తాజాగా భర్తీ చేయనున్న పోస్టులను ప్రాధాన్య క్రమంలో నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత బడుల్లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి.. ఉపాధ్యాయులు లేని పాఠశాలలను ఎంపిక చేసి ఆయా చోట్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలుత డీ, సీ కేటగిరీలనే ప్రాధాన్యంగా తీసుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
పది రోజుల ప్రణాళిక సిద్ధం
ఈ నెల 11న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి, 13, 14తేదీల్లో అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15న ఎంపికైన ఉపాధ్యాయులు బడుల్లో చేరేలా ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ నెల 18న పోస్టింగ్ ఆర్డర్లు పంపిణీ చేస్తారు. 19న అభ్యర్థుల రిపోర్టింగ్ వివరాలు ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖాధికారులకు అందజేస్తారు. రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను ఈ నెల 20న టీఎస్‌పీఎస్‌సీకి అందజేస్తారు.
ఇదీ చదవండిః ఆలమట్టికి కృష్ణమ్మ పరుగులు