Sand mafia in mancherial district: మంచిర్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మితిమీరిపోతోంది. ఏకంగా వాగులోనే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు అక్రమ రవాణాదారులు. ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా జరుగుతున్నా అధికారులకు ఇదేమీ పట్టడం లేదు. దీంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోంది. సహజ వనరులను కొల్లగొడుతూ.. భూ గర్భ జలాలను ఎండగడుతున్నారు. జేసీబీ సహాయంతో నెలల తరబడి తవ్వకాలు జరుపుతున్నా.. ఈ తతంగమంతా రెవెన్యూ, భూ గర్భ గనుల, అటవీ శాఖ అధికారులకు కనిపించకపోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇసుక కోసమే ట్రాక్టర్ల కొనుగోలు
మందమర్రి మండలం శంకరపల్లి గ్రామం చుట్టూ సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం పాలవాగు ప్రవాహం ఉంటుంది. ఇక్కడ ఇసుక నాణ్యతగా ఉండటంతో దీనిపై ఇసుక మాఫియా కన్నుపడింది. ఇంకేముంది అక్రమంగా ఇసుక తోడేసి.. లక్షాధికారులు కావాలని భావించారు. క్షణాల్లో వాగులోనే ఏకంగా తాత్కాలిక రహదారిని నిర్మించారు. రాత్రింబవళ్లు తేడాలేకుండా యథేచ్ఛగా వందలాది ట్రాక్టర్ల ఇసుక తోడుతూ అధిక ధరలకు అమ్ముకుని.. లక్షల రూపాయలు గడిస్తున్నారు. కేవలం ఇసుక తరలించేందుకే పలువురు ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడ ఇసుక దందా ఏ మేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
బెదిరింపులకు పాల్పడుతూ
గ్రామానికి చెందిన రైతుల పొలాలు చాలావరకు వాగు పక్కనే ఉన్నాయి. సాగు చేసేటప్పుడు వాళ్లకు నీటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి నోరు మూయిస్తున్నారు. మరి కొందరైతే వాగు తమ భూమిని ఆనుకుని ఉందని.. ఈ వాగు కూడా తమదే అంటూ మిగతా రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలా దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమంగా ఇసుకను దోచుకుంటున్నారు. ఆ ఇసుకనంతా ఇక్కడ నుంచి మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, దేవాపూర్ గ్రామాలకు తరలించి రూ. లక్షలు గడిస్తున్నారు. స్థానికంగా ఉండే వ్యాపారానికి సంబంధించిన జేసీబీ యంత్రం సహాయంతోనే ఈ తతంగం మొత్తం నడుస్తున్నట్లు సమాచారం. ఇదంతా తహసీల్దార్ కార్యాలయానికి కేవలం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం కొసమెరుపు.
మా దృష్టికి రాలేదు..
ఓ వైపు అనుమతి లేకుండా ఇసుక తోడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇంతవరకూ తామెవరికీ అనుమతి ఇవ్వలేదని.. మండలం దాటి ఇసుక అక్రమ రవాణా జరిగితే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Sand Sale : రాష్ట్రంలో తగ్గిన ఇసుక కొనుగోళ్లు.. కారణమేంటంటే?