కార్మికులు చేపట్టిన మూడు రోజుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు తెరాస అనుబంధ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కుట్రలు చేస్తున్నారని బీఎంఎస్ నాయకులు కాంపల్లి సమ్మయ్య ఆరోపించారు. అయినప్పటికీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కుట్రలను నిరసిస్తూ.. ఆందోళన చేపట్టిన జాతీయ కార్మిక సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకుల అరెస్టును కార్మికులు తీవ్రంగా ఖండించారు. గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, సింగరేణి రక్షణ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఐదు జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడవ రోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాల్లో కొనసాగుతోంది. ఆరు భూగర్భ, రెండు ఉపరితల గనుల్లో ఆరు వేల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో అత్యవసర సిబ్బంది, గుర్తింపు సంఘం కార్మికులు మినహా అందరూ విధులకు దూరంగా ఉన్నారు. కార్మికులంతా సమ్మెలో ఉండటం వల్ల... బొగ్గు గనులు, వివిధ విభాగాలు నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చూడండి: గ్రేటర్లో విజృంభణ.. రికార్డు స్థాయిలో 1658 కేసులు