ఉపరితల గనుల్లో బొగ్గును వెలికి తీసుకుంటూ ముందుకు సాగే ప్రక్రియ ఉంటుంది. ఈ క్రమంలో శాశ్వతంగా ఏదీ ఏర్పాటు చేసే వీలు ఉండదు. ఒకవేళ ఏర్పాటు చేసినా దానికి చాలా ఖర్చు అవుతుంది. అయితే ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు సింగరేణి అధికారులు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికలోని రామకృష్ణాపూర్ ఉపరితల గని వద్ద ఓ వినూత్న ప్రయత్నం చేశారు.
వృథాగా పడేసిన వాహనాల టైరు మధ్య భాగంలో ఇనుప స్తంభాన్ని ఉంచి, అది ఎటూ కదలకుండా అందులో సిమెంటు నింపారు. స్తంభం పైభాగంలో విద్యుత్ దీపాలను అమర్చారు. దానికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వినియోగించుకుంటున్నారు.
ఇలా అవసరమైన చోట వినియోగించి.. విద్యుద్దీపాల వెలుగులో బొగ్గు ఉత్పత్తి ఆగకుండా నిరంతరం పనులు చేస్తున్నారు. అంతేకాకుండా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలు, ఆవిర్భావ వేడుకలు, ఇతర పెద్ద కార్యక్రమాల్లోనూ ఈ స్తంభాల సేవలను వినియోగించుకుంటున్నారు.
ఇదీ చూడండి: 'ఈ ఏడాదిలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తి'