మంచిర్యాల పురపాలక సంఘంలో వార్డుల విభజనపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పొంతన లేకుండా విభజన చేశారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ 32 వార్డులు ఉండగా, తాజాగా మరో నాలుగు వార్డులను ప్రభుత్వం పెంచింది. అసెంబ్లీ ఓటరు జాబితా ప్రకారం పట్టణంలో 84,690 మంది ఓటర్లు ఉన్నారు. 36 వార్డులుగా విభజించారు. ఇందులో ఒక్కొక్క వార్డుకు 2,117 నుంచి 2,587 మంది ఓటర్లు ఉండేలా వార్డుల విభజన చేసి ముసాయిదా జాబితాను ప్రకటించారు. దీనిపై ఈ నెల 5 వరకు అభ్యంతరాలు స్వీకరించడానికి అవకాశం కల్పించారు.
ఎటూతేలని వ్యవహారం
హైకోర్టు 1998లో ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం ‘పుర’ పరిపాలన వ్యవహారాల కార్యదర్శికి మందమర్రి ఎన్నికల నిర్వహణ విషయమై 1999 ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏజెన్సీ ఏరియాలో ఉన్న పురపాలిక ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా వివాదం తలెత్తితే కేవలం పార్లమెంట్ జోక్యం చేసుకుని షెడ్యూల్డ్ ఏరియాల విభాగం 9(ఎ) చట్టం ప్రకారం బిల్లు ఆమోదించాల్సి ఉంది. పార్లమెంట్ మాత్రమే ఈ వివాదాన్ని పరిష్కరించగలదని కేంద్ర పరిపాలన పట్టణ అభివృద్ధి విభాగం వారు 2000 జూన్ 27న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. సుదీర్ఘకాలంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ప్రజాప్రతినిధులు పలుమార్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినా ఈ వ్యవహారం ఎటూతేలలేదు. దీంతో 24 ఏళ్లు నిధులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో అనేక సమస్యల నడుమ ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
జీవో విడుదలై రెండేళ్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నేపథ్యంలో మందమర్రి, పాల్వంచ, మణుగూరు పురపాలిక ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. షెడ్యూల్డ్ ప్రాంతాలకు 1965 తెలంగాణ పురపాలిక చట్టాన్ని వర్తింపజేస్తూ పురపాలకశాఖ 24.07.2017న ప్రత్యేక జీవో నం.200 జారీ చేసింది. 1965 తెలంగాణ మున్సిపాలిటీ చట్టం సెక్షన్ 8, సబ్‌సెక్షన్ (2) కింద అదనంగా కొత్త అంశాలను చేర్చారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ఎస్టీలకు రిజర్వేషన్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం వార్డుల్లో యాభైశాతం ఎస్టీ మహిళలకు, మిగతా 50శాతం వార్డుల్లో 1/3 బీసీలకు రొటేషన్ పద్ధతిలో, జనాభా దమాశా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేస్తారు. ఎస్టీ అభ్యర్థే ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమైందని అంతా భావించారు. కానీ ఇంతవరకు ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఎన్నికలపై అయోమయం
వచ్చే నెలలో పురపాలిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయా లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్లు, వార్డుల విభజన కూడా దాదాపు ఖరారు కావడంతో మందమర్రి ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
నిధులు లేక నీరసించి
పాలవకర్గం ఉన్న పురపాలికాలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తున్నారు. పాలకవర్గం లేని మందమర్రిలో ఎన్నికలు జరగకపోవడంతో నిధులు లేక నీరసించిపోయింది. రెండేళ్ల క్రితం వరకు ఆర్థిక సంఘం నుంచి ఎంతోకొంత నిధులు వచ్చే అవకాశం ఉన్నా ఎన్నికలు లేనిచోట నిధుల విడుదల నిలిపివేశారు. పురపాలిక ఖజానాలో డబ్బులు లేక నిర్వహణ కష్టమవుతోంది.
న్యాయస్థానం పరిధిలో ఉంది. బాల్క సుమన్, చెన్నూరు ఎమ్మెల్యే
మందమర్రి పురపాలికకు ఎన్నికలు జరిపించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పలుమార్లు చర్చించాను. మందమర్రి, మణుగూరు, పాల్వంచ పురపాలికల్లో 1/70 చట్టంకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. కేసు పూర్తయిన అనంతరం ఎన్నికలు జరిపించేందుకు కృషి చేస్తాం.
ఇచ్చిన హామీ నెరవేర్చాలి. సొత్కు సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి
వార్డులో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతం అవుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ‘పుర’ ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేతలు తమమాట నిలబెట్టుకోవాలి.
ఇదీ చూడండి : 'బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో మీరే కీలకం'