పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నాయకులు మంచిర్యాలలోని అంబేడ్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్ నుంచి 40 డాలర్లకు వరకు తగ్గినా... చమురు కంపెనీలు విచ్చలవిడిగా పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచడాన్ని ఖండించారు.
లీటర్కు పది రూపాయలు ధర పెరగటం వల్ల సామాన్యుడిపై భారం పడుతుందని ఆరోపించారు. నిత్యవసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా లాక్డౌన్లో ఆదాయం కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే 15 నుంచి 20 రోజుల్లో ప్రభుత్వాలు ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెట్టుబడిదారులకు రుణాలు మాఫీ చేసి, పేదలకు మాత్రం ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వం నైజమని ఆక్షేపించారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎంత మంది పేదలకు అందించిందో భాజపా సమాధానం చెప్పాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు.