కరోనాను జయించి కొత్త ఆశలతో ముందుకు..
కుటుంబమంతా కరోనా బారిన పడినా మనోధైర్యంతో జయించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు మంచిర్యాల పట్టణానికి చెందిన 76 ఏళ్ల అహల్య. మూడేళ్ల కిందట గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెతో పాటు కుమారుడు, మనుమడు, మనుమరాలు సైతం కరోనా బారిన పడి ఇబ్బందులకు గురయ్యారు. మనోధైర్యంతో వైరస్‌ను జయించి పది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. జీవితంపై నమ్మకంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని ఆమె చెబుతున్నారు.
సడలని ధైర్యం..
కరోనా మహమ్మారి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి బాట పట్టారు ప్రైవేటు ఉపాధ్యాయుడు నాయిని శ్రీధర్. మంచిర్యాల పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా నెలకు రూ.18 వేల జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్న ఆయనకు పాఠశాలలు మూతపడటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మందమర్రి మార్కెట్‌లో చికెన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రూ.15 వేల వరకు సంపాదించుకుంటున్న ఆయన ఎలాంటి పరిస్థితులకైనా కుంగిపోకుండా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చెబుతున్నారు.
పొదుపు కావాలి తారకమంత్రం
గతేడాది నెలల తరబడి లాక్‌డౌన్‌తో వివిధ రంగాలు కుదేలయ్యాయి. సడలింపుల అనంతరం కూడా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. జీవనాధారం కోల్పోయిన కుటుంబాల పోషణ భారంగా మారింది. ఎలాంటి విపత్తులు వచ్చినా.. కనీసం ఆరు నెలల పాటు జీవించగలిగేలా నగదు నిల్వలు అందుబాటులో ఉండేలా పొదుపు పాటించాలని లాక్‌డౌన్ చాటిచెప్పింది.
గతం నేర్పింది పాఠం.. ఇప్పుడు ఇలా చేద్దాం..
అంతర్జాలం జీవితంలో అంతర్భాగం
నిత్యావసరాలు సహా విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం రంగాలకు అంతర్జాలం ఎంత ముఖ్యమో లాక్‌డౌన్ తెలిపింది. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం, వ్యాపారులకు ఈ కామర్స్, రోగులకు టెలీ మెడిసిన్ అంతర్జాల సేవల ద్వారా పొందేందుకు వీలు కలిగింది.
భౌతిక దూరమే తారక మంత్రం
రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు పాటించాల్సిన పద్ధతులను కరోనా నేర్పింది. బస్టాండులు, రైల్వేస్టేషన్లు, సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, ఆలయాల్లో జనం గుమిగూడే సందర్భాలే ఎక్కువ. అలాంటి వాటికి ఇక స్వస్తి చెప్పాలి.
బలహీనతలను వీడాలి
కరోనా వ్యక్తిగత బలహీనతలను దూరం చేసింది. దురలవాట్లకు దూరంగా ఉండగలుగుతామన్న ఆలోచనను కలిగించింది. గుంపులుగా ఎక్కువ సేపు ఉండడం సరికాదని తెలియజేసింది. ఇంట్లో సరకులు లేకున్నా సర్దుకుపోయే తత్వాన్ని ఇకముందూ కొనసాగించాలి.
కుటుంబ బంధాలకు ప్రాధాన్యం
ఉరుకులు, పరుగుల గజిబిజి జీవితంలో యాంత్రికరగా మారిన కుటుంబ బంధాలు లాక్‌డౌన్‌లో అయినవాళ్ల కోసం సమయం కేటాయించి వారితో ఆనందాలు పంచుకునేలా చేసింది. ఒకరికి ఒకరు సహకరించుకుంటే కలిగే సంతోషాన్ని తెలియజెప్పింది.
మానవ సంబంధాలు
కరోనా మనుషుల మధ్య భౌతికంగా దూరం పెరిగేలా చేసినా మానవత్వాన్ని మాత్రం తట్టిలేపింది. అడపా దడపా అమానవీయ ఘటనలు జరిగినా లాక్‌డౌన్ కష్టకాలంలో అన్నార్థులు, అభాగ్యులకు మేమున్నాం అంటూ అండగా నిలిచి దాతృత్వాన్ని చాటిన వారే ఎక్కువ. భవిష్యత్తులో కూడా మనుషుల మధ్య దూరం పెరగకుండా మానవ సంబంధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇదీ చూడండి: రేపు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు