HC on Compensation to Daughters: భూసేకరణ సందర్భంగా పునర్నిర్మాణ, పునరావాస పథకం కింద పరిహారం ప్రయోజనాల కల్పనలో మేజర్లయిన కుమార్తెల పట్ల వివక్ష చూపడం తగదని హైకోర్టు పేర్కొంది. మేజర్లయిన కుమారులతోపాటు సమానంగా కుమార్తెలకూ పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 4(1) నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి తల్లిదండ్రులతో ఉన్న మేజర్లయిన కుమార్తెలకు పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
మంచిర్యాల జిల్లా నాస్‌పూర్ మండలం తాళ్లపల్లిలో శ్రీరాంపూర్2 బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్‌గా మార్చడానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో కుమారులతోపాటు మేజర్లయిన తమకు పరిహారం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ తాళ్లపల్లికి చెందిన 78 మంది యువతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్ అండ్ ఆర్ నిమిత్తం గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 68, దానికి సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 88 ప్రకారం మేజర్లయిన కుమారులతో సమానంగా కుమార్తెలకు పరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొత్తం మీద యువకులతోపాటు 829 ప్రభావిత కుటుంబాలను గుర్తించి 2008లో అవార్డు చెల్లించినట్లు చెప్పారు. అందువల్ల జీవో 88 ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతోపాటు 645 రోజులకు వేతనం, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్న అభ్యర్థనను చట్టం అనుమతించదన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి తీర్పు వెలువరిస్తూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాలంటూ కలెక్టర్‌కు పిటిషనర్ల పేర్లతో ఆర్డీవో జాబితా పంపడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమన్నారు. ఒకసారి కుమారులకు ప్రయోజనం కల్పించాక కుమార్తెలపట్ల వివక్ష చూపుతూ తిరస్కరించడానికి వీల్లేదన్నారు. సవరించిన జీవో 88 ప్రకారం మేజర్లయిన కుమార్తెలూ కుటుంబంలో భాగమేనని, నోటిఫికేషన్ జారీ చేసేనాటికి మేజర్లయిన వారిని గుర్తించి పరిహారం చెల్లించాలని ఆదేశించారు.