వ్యవసాయంలో యాంత్రీకరణ తనదైన ముద్ర వేసుకంటోంది. కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుతం సమయంలో యంత్రాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఉదాహరణకు వరిలోనాటు నుంచి కలుపుతీత, కోత, నూర్పిళ్లు, గడ్డి కట్టలుగా కట్టడం ఒక్కటేమిటీ అన్నిటికీ యంత్రాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇక ఇప్పుడు సంచార రైస్ మిల్లు కూడా వచ్చేసింది. మంచిర్యాల జిల్లాలో సంచార రైస్ మిల్లు సందడి చేస్తోంది. నాణ్యమైన పనితనంతో వడ్లను బియ్యంగా మారుస్తూ... పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రైతుల ఇళ్ల వద్దకే
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన పార్వతి లచ్చయ్య అనే రైతు.. బీహార్‌లో 5 లక్షల 50 వేల రూపాయలు చెచ్చించి సంచార రైస్‌మిల్లును కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొచ్చాడు. సంచార రైస్ మిల్లుతో రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ధాన్యం మరబట్టి బియ్యంగా మారుస్తున్నాడు. 45 నుంచి 60 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో నడిచే ఈ రైస్ మిల్లు... గంటకు 8 నుంచి 10క్వింటాళ్ల ధాన్యాన్ని మరపడుతోంది. మిల్లింగ్ విధానాలపై తనకున్న అవగాహనతో పాటు బీహార్‌లోనే పది రోజులపాటు రైస్‌మిల్లు నిర్వహణపై శిక్షణ తీసుకున్నట్లు రైతు తెలిపాడు.
రైతుల హర్షం
పంట పండించడానికి అహర్నిశలు శ్రమించిన రైతులు... చేతికొచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అవస్థలు పడుతున్నారు. ధాన్యాన్ని రైస్‌మిల్లుకు తరలిస్తే మరపట్టించేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఈ సంచార రైస్‌మిల్లు సాయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దే ఎంతో నాణ్యతతో కూడిన బియ్యంతో పాటు తౌడునూ పొందగలుగుతున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
సమయం ఆదా
సంచార రైస్‌మిల్లు నేరుగా కల్లాల వద్దకే వచ్చి మరపట్టే విషయం తెలియడంతో చాలా మంది రైతులు... లచ్చయ్యను సంప్రదిస్తున్నారు. రైతులు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లడం, వారి కళ్లెదుటే ధాన్యాన్ని మరపట్టించడం అంతా గంటల్లోనే జరిగిపోతోంది. సంచార రైస్ మిల్ పనితీరును జిల్లా వ్యవసాయాధికారి వీరయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు . సాధారణ రైస్‌మిల్లు మాదిరిగానే సంచార రైస్‌మిల్లులో కూడా బియ్యం నాణ్యంగా వస్తున్నాయని ఆయన తెలిపారు. రైతుల చెంతకే మిల్లు రావడంతో రైతులకు రవాణా ఖర్చులతో పాటు శ్రమ, సమయం ఆదా అవుతున్నాయని... ప్రతి రైతు వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే యంత్రాల సంఖ్యను పెంచి రాయితీ ద్వారా అందజేస్తే ఎంతో మేలు జరుగుతుందని పలువురు రైతులు ఆశిస్తున్నారు.