మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 30వ వార్డులో తెరాస సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్, భాజపా నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు గెలి విజయలక్ష్మి, మీనాక్షి పోటీ నుంచి తప్పుకోవడంతో తెరాస తరఫున సుకేశిని భరద్వాజ్ కౌన్సిలర్‌గా ఏకగ్రీవం అయ్యారు. సీపీఐ మొదటి నుంచి పోటీకి దూరంగా ఉంది.
తెరాస విజ్ఞప్తి
బెల్లంపల్లి పట్టణం 30వ వార్డు కౌన్సిలర్ కరుణబాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. పోటీ అనివార్యం కావడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రక్రియ ప్రారంభమైంది. తెరాస నుంచి కరుణబాయి కుమార్తె సుకేశిని భరద్వాజ్, కాంగ్రెస్ నుంచి గెల్లి విజయలక్ష్మి, భాజపా నుంచి మీనాక్షి నామపత్రాలు దాఖలు చేశారు. కౌన్సిలర్ మృతితో మానవతా దృక్పథంతో మిగిలిన పార్టీల నాయకులు ఆలోచించాలని స్థానిక తెరాస నాయకులు విజ్ఞప్తి చేయడంతో ఆయా పార్టీల నాయకులు అంగీకరించారు.
చర్చలు సఫలం
పట్టణంలోని తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు బుధవారం సమావేశమై ఏకగ్రీవ ఎన్నిక కోసం చర్చించారు. చర్చలు సఫలం కావడంతో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. ఇద్దరు అభ్యర్థులు నామపత్రాలను ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్, బత్తుల సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు సూరిబాబు, జయరాం, భాజపా నాయకులు కొయ్యల ఏమాజీ, మునిమంద రమేశ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బంగాల్‌లో ఎన్నికల ప్రచార ఫలితం ఇదీ..!