పాలమూరు జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ ముందుకుసాగట్లేదు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్.. నారాయణపేట జిల్లా దామరగిద్ద, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు, గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలాల్లో.. ఆహార శుద్ది పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. హన్వాడలో వెయ్యి ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
తొలి విడతగా 213 ఎకరాలను గుర్తించి సేకరించాలని ఆ తర్వాత విస్తరించాలని నిర్ణయించింది. 78ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా.. మరో 135ఎకరాల అసైన్డ్ భూముల్ని రైతులనుంచి సేకరించాల్సి ఉంది. నవంబర్‌లో నోటిఫికేషన్ జారీచేశారు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన పరిహారానికి.. 70శాతం వరకూ రైతులు భూములిచ్చేందుకు అంగీకరించారు. కొంతమంది భూమికి, భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో.. భూసేకరణ ప్రక్రియ ఆలస్యమైంది.
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం కంబల్లాపురంలో.. ఆహారశుద్ధి పరిశ్రమ కోసం 454 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావించింది. అందులో 233 ఎకరాల భూములు సేకరించి.. టీఎస్ఐఐసీకి అప్పగించి రెండేళ్లు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు. మరో 171 ఎకరాలను భూసేకరణ కోసం గుర్తించారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు అనువైనవి కావని, భూగర్భజలాలు కలుషితం అవుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరంగాపూర్ జలాశయ నిర్మాణంలో ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు మరోసారి భూములు పోగొట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్‌పల్లిలో.. 229 సర్వేనంబరులో 1024ఎకరాలప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుచేయాలని సర్కారు భావించింది. వాటిని చాలాకాలంగా కంపానిపల్లి, కలవారి గుడిసెల రైతులు సాగు చేసుకుంటున్నారు. కానీ వారికిఎలాంటి హక్కు పత్రాలు, పట్టాలులేవు. 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇంటిపన్ను, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. అలాంటి భూముల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయడాన్ని రైతులు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో తొలుత ధరూర్, దోర్నాల మండలాల్లో.. 166 ఎకరాల స్థలం గుర్తించారు. వివాదాలు చెలరేగడంతో ప్రస్తుతం కేటీదొడ్డి మండలం కొండపూర్‌లో 300 ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో 422 ఎకరాలు సేకరించి టీఎస్ఐఐసీకీ అప్పగించారు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన కోసం పనులు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి: