ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం, నూతన విద్యుత్ చట్టం రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అందుకే ఆ రెండు చట్టాలను తెరాస తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ మహబూబ్ నగర్ జిల్లా కరివెన జలాశయం వద్ద కృతజ్ఞతా సభ నిర్వహించారు.
కృతజ్ఞతా సభ..
ఈసభకు మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి సుమారు 4,500 ట్రాకర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు వద్ద ర్యాలీని ప్రారంభించగా.. బాలానగర్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మూసాపేటలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ర్యాలీలను ప్రారంభించారు.
రోడ్లపైకి రైతులు..
నూతన రెవిన్యూ చట్టాన్ని సమర్థిస్తూ.. రైతులు తెలంగాణలో రోడ్డుపైకొస్తుంటే.. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు రోడ్లపైకి వస్తున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ చట్టం ద్వారా రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించే బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ చట్టం ద్వారా దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఉత్పత్తి, ధర అన్ని కేంద్రం నియంత్రణలోకి వెళ్తాయన్నారు.
కేంద్రమంత్రి ముందు సమస్యలు..
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో.. తెలంగాణ రైతుల సమస్యలు, డిమాండ్లను కేంద్రం ముందు ఉంచినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాలలో నువ్వుల పరిశోధన కేంద్రం, పాలమూరు జిల్లాలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్, భాజపాలు రెండూ రెండే.. రైతులకు మేలు జరగదు: హరీశ్ రావు