Telangana HC Verdict on Srinivas Goud Election : రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేందర్ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులను, గ్రామీణ వికాస్ బ్యాంకు నుంచి పొందిన రూ.12 లక్షల రుణం, ఇతర వివరాలను పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిథ్య చట్టం కింద తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించినట్లయితే ఆ ఎన్నిక చెల్లదన్నారు. చట్టవిరుద్ధంగా జరిగిన శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరువర్గాల తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెల్లడించింది.
సీఈసీ సహా 11 మందిపై కేసు నమోదు..: ఈ వివాదానికి సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు 11 మందిపై గత ఆగస్టు నెలలో మహబూబ్‌నగర్ రెండో పట్టణ పీఎస్‌లో కేసు నమోదైంది. ఇదే ప్రాంతానికి చెందిన రాఘవేందర్ రాజు అనే వ్యక్తి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌పై పాలమూరు మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సలహా అనంతరం మొత్తం 21 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 241/2023 నంబర్‌తో ఎఫ్ఐఆర్ నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తునట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యదర్శి సంజయ్ కుమార్, అప్పటి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, అప్పటి ఆర్డీవో శ్రీనివాస్, ఐటీ బృంద సభ్యుడు వెంకటేష్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ పద్మ శ్రీ, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావు, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్‌లపై కేసు నమోదు చేశారు.