దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార తెరాస నేతలు అరాచకం సృష్టించారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా మణికొండలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. దుబ్బాక స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలన్న ఏకైక లక్ష్యంతో తెరాస నేతలంతా అక్కడే దృష్టి సారించారన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చన్న అహంకారంతో దౌర్జన్యం చేశారన్నారు. విసుగెత్తిన యువత.. భాజపాకు మద్దతుగా నిలబడ్డారని తెలిపారు.
"బంగారు తెలంగాణ అని చెప్పే కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలి. వెనకబాటు అంటే ఏంటో దుబ్బాకను చూస్తే తెలుస్తోంది. తెలంగాణ వస్తే నీళ్లు, నిధుల, నియామకాలంటూ కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారు. ఆరేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు, విద్యావంతులకు ఉపాధి అవకాశాలే లేకుండా పోయాయి. ఇకనైనా యువత కళ్లు తెరవాలి. తెరాస పాలనకు చరమగీతం పాడాలి."
-డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
ఛత్రపతి శివాజీ వల్లే హిందూ ధర్మం దేశంలో మిగిలిందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి అన్నారు. తల్లి జిజియాబాయ్ నేర్పిన పాఠాలు విన్న శివాజీ భారత సంప్రదాయాల రక్షణ కోసం పోరాడారని చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆడ పిల్లలపై అకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మోదీ పాలనలో మత విద్వేషాలు లేని సురక్షితమైన భారతావని చూస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో పెట్టుబడులపై రేపు కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్