ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీజనల్ వ్యాధులు క్రమంగా విస్తరిస్తున్నాయి. జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించినా.. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ముఖ్యంగా కాలం మారడం, నిత్యం వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ ప్రదేశాల్లో నీటి నిల్వలు అధికమవుతున్నాయి. మురుగు కాల్వనీరు కాలనీల్లోకి, ఇళ్ల స్థలాల్లోకి చేరి దోమలకు నిలయంగా మారుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడాలేకుండా పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అపరిశుభ్రతను పారదోలి, దోమల నివారణ కోసం ప్రతి శుక్రవారం డ్రై నిర్వహించాల్సి ఉన్నా.. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడంతో జనం సీజనల్ వ్యాధుల బారినపడుతున్నారు.
కేవలం జ్వరాలు మాత్రమే కాకుండా వాంతులు, విరేచనాలు, డయేరియా బారినపడే వారి సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. గద్వాల మున్సిపాలిటీలో అతిసార లక్షణాలతో ముగ్గురు మృత్యువాతపడగా.. 48 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం.. తాగు నీరు, తినే ఆహారం కలుషితం కావడం వల్ల జనం వ్యాధుల బారినపడుతున్నారు.
అదే కారణం..! జూన్‌తో పోల్చితే జులైలో సీజనల్ వ్యాధుల బారినపడి ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం సాధారణమే అయినా.. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురికావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు.
వేచి చూడాల్సిందే..: కాలానుగుణ వ్యాధులను ఎదుర్కొనేందుకు మూడంచెల వ్యూహాన్ని అనుసరించాలని ఇటీవలే మంత్రి హరీశ్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచడం, పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడం, త్వరితగతిన చికిత్స అందించాలని సూచించారు. ఈ మేరకైనా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఇవీ చూడండి..
ఆ ఆసుపత్రుల్లో... ఇక మందుల్లేవనే మాట రావద్దు.!
వరదలో చిక్కుకుపోయిన పాఠశాల బస్సు.. 25 మంది విద్యార్థులు సేఫ్..