కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి పంపుహౌస్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోయిన మిషన్ భగీరథ నీటి సరఫరాను మంగళవారం నుంచి పునరుద్ధరించనున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూర్ రిజర్వాయర్ పంపు హౌస్ మోటార్లలో ఏర్పడిన సమస్య వల్ల 35 రోజుల నుంచి జిల్లా ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
నీటిపారుదల ఇంజినీర్లు చేపట్టిన మరమ్మతులతో మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రజలకు తాగు నీరు అందనుందని కలెక్టర్ చెప్పారు. మన్యంకొండ, జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ పంపులకు ముడిజలాలు చేరుకున్నాయని తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. రైతులు తమ ధాన్యం తడవకుండా కాపాడుకోవాలని, సాధ్యమైనంత త్వరగా మిల్లులకు పంపించాలని చెప్పారు.