దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో కలిసి వినతిపత్రం అందజేశారు.
అత్యవసర వైద్యం అందక..
దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, అడ్డాకుల, మూసాపేట, బూత్పూర్ మండలాలు జాతీయ రహదారిపై ఉన్నందున.. ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్లు లేనందున ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను మహబూబ్ నగర్, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. గాయపడ్డ వారికి అత్యవసరమైన వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారని.. వారి కుటుంబాలకు దిక్కులేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై గతంలో ఎన్నోసార్లు జిల్లా అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందువల్ల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలోని.. ఇతర మండలాలకూ అందుబాటులో ఉన్న కొత్తకోట పట్టణంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేయాలన్నారు. 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి వీలైనంత త్వరగా కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని యుగంధర్ చెప్పారు.
ఇదీ చూడండి: 'గంగపుత్రులకు మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలి'