Rahul Gandhi On BJP And TRS: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయన అవలంభించే రైతు వ్యతిరేక విధానాలకు కేసీఆర్ మద్దతిస్తూ వచ్చారని విమర్శించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రంలో నాల్గో రోజు ఉదయం పాలమూరు నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌కు.. గిరిజన నృత్యాలతో స్వాగతం పలికారు. పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు బతుకమ్మలతో రాహుల్ వద్దకు వెళ్లి.. తమ సమస్యలను వివరించారు.
పాదయాత్ర చేస్తూ తమ సమస్యలపై ప్లకార్డులు చూపిస్తున్న వారి వద్దకు వెళ్లి రాహుల్ వారితో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్స్, వర్సిటీ ఐకాస సభ్యులతో సంభాషించారు. జోడో యాత్రలో కాసేపు రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేసిన సినీ నటి పూనంకౌర్.. చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మోడ్రన్ రైతుబజార్ వద్ద రాహుల్‌కు మహిళలు మంగళహారతులు ఇవ్వగా.. పారిశుద్ధ్య సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగారు.
పాదయాత్ర చేస్తూనే తన కోసం ఎదురుచూస్తున్న పలువురు యువతీయువకులు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిన్నారులను రాహుల్ దగ్గరకు వెళ్లి పలుకరించారు. మహబూబ్‌నగర్ సమీపంలోని ఏనుగొండ దాకా మధ్యాహ్నం వరకు యాత్ర చేసిన రాహుల్.. ఏనుగొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రారంభమైన యాత్ర.. జడ్చర్ల వరకు కొనసాగనుంది.
జడ్చర్ల చౌరస్తాలో నిర్వహించే కూడలి సభలో రాహుల్‌గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించిన ఆయన.. భాజపా, తెరాసలు రాజకీయ పార్టీలుగా కాకుండా వ్యాపార సంస్థలుగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో సాగుతున్న పాదయాత్రలో తాను ఇక్కడి ప్రజల గోడు విన్నానన్న రాహుల్.. రైతులు, కార్మికులు, చిన్నతరహా వ్యాపారులు, యువత, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉందన్న ఆయన.. గిరిజనులు, దళితులకు చెందిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. దళితులు, గిరిజనులకు సంబంధించిన భూములపై వారికి పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తామని హామీఇచ్చారు.
ఇవీ చదవండి: