గురువులు.. తమ వద్ద చదువుకునే విద్యార్థుల తలరాతలతో పాటు సమాజ దిశను మార్చడంలో కీలకపాత్ర వహిస్తారని తెలుసు. జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తోన్న సదాశివయ్య సామాజిక బాధ్యత నిర్వహిస్తూ.. విద్యాబోధనతో పాటు సమాజానికి ఎలా తోడ్పడాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కళాశాలలో 800 రకాల మొక్కలతో బొటానికల్ గార్డెన్‌ను రూపొందించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మూడేళ్లలో అతి సుందరమైన, ఆహ్లాదకరమైన బొటానికల్ గార్డెన్‌ను ఏర్పాటు చేసిన సదాశివయ్యను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌కు రప్పించుకుని ప్రశంసించారు. గార్డెన్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారు.
మూడేళ్లపాటు తాను పడిన కష్టాన్ని, హరితవనం ఏర్పాటు చేసిన కృషిని ప్రపంచానికి తెలియజేసిన ఈటీవీకి ప్రొఫెసర్ సదాశివయ్య కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి అభినందనలు ఈటీవీ తనకిచ్చిన బహుమతిగా అభివర్ణించారు. ఈటీవీలో కథనంగా ప్రసారం చేసిన సదాశివయ్య కృషిని వీక్షించిన ముఖ్యమంత్రి ప్రొఫెసర్ నిబద్ధతకు మంత్రముగ్ధులై అభినందించిన విషయం తెలిసిందే.
- ఇదీ చూడండి : పచ్చదనానికి గురువులు.. సీఎం ప్రశంసలు