లాక్డౌన్ సడలింపుల తర్వాత ప్రజలు కొవిడ్ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మాస్క్ ధరించి బయటకు వెళ్లాలి. అయినా... చాలామంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. మాస్క్ ధరించకపోతే వినియోగదారునికి ఎలాంటి సేవలు అందించవద్దన్న నిబంధనలు కూడా బేఖాతరు చేస్తున్నారు. ఇక భౌతికదూరం, శానిటైజేషన్ వంటివి ఎక్కడా అమలు కావడం లేదు. బస్టాండ్లు, మార్కెట్లు, కూడళ్లు, సభలు, సమావేశాల దగ్గర కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు.
జనంలో భయం తగ్గిపోయింది..
వైరస్ బారిన పడుతున్నవారిలో 85శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. కేవలం 15శాతం మంది విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి ఎక్కువ మంది కోలుకుంటున్నారు. అందువల్ల ప్రస్తుతం వైరస్ పట్ల భయం జనంలో తగ్గిపోయింది. మరోవైపు రోగ నిరోధకశక్తి పెరిగితే మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చన్న సూచనలతో పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఎండు ఫలాలు, పాలు, గుడ్ల లాంటివి విస్తృతంగా లాక్‌డౌన్‌లో వినియోగించారు. ప్రస్తుతం ధరలు పెరిగిపోవడం వల్ల ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించడం లేదు.
గుమిగూడితే అంతే..
ఒకవేళ నిబంధనల అమలు పట్ల నిర్లక్ష్యం కొనసాగితే... వచ్చే 4 నెలల్లో కేసుల సంఖ్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం ముగిసే వరకూ కొవిడ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. నవంబర్ నుంచి మార్చి వరకు దీపావళి, క్రిస్మస్ వంటి పండుగులతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో జనం గుమిగూడితే వైరస్ వ్యాప్తి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకూ 30వేల కొవిడ్ కేసులు నమోదు కాగా...సుమారు 1800 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. 29వేల మంది కోలుకున్నారు. 299 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. గరిష్టంగా ఒకే రోజు 800లకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం వందలోపే నమోదు అవుతున్నాయి. ఈ సంఖ్య పెరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా సెకండ్ వేవ్ మెుదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా ?