కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్రయులు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వివిధ సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు, దేవాలయాల ప్రాంగణాలలో ఆశ్రయం పొందిన వారికి ఆహారాన్ని అందించి ఆకలి తీరుస్తున్నాయి. పట్టెడు అన్నం దొరకక ఆకలితో అలమటిస్తూ రోడ్లపై ఉన్న అనాధలకు ఆహారం పొట్లాలను అందిస్తున్నారు.
లారీ, అంబులెన్స్ డ్రైవర్లకు...
లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యవసర సరుకులకు, మందులకు ఆటంకం కలుగకుండా రవాణా కొనసాగిస్తున్న పలువురు లారీ డ్రైవర్లు లాక్‌డౌన్ సందర్భంగా జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలను మూసివేయటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన పాలమూరు యువత ప్రతిరోజు 250 మందికి భోజన పొట్లాలను అందించే కార్యక్రమం చేపట్టింది. రాత్రి వేళలో సరుకు రవాణా చేస్తున్న డ్రైవర్లకు, అంబులెన్స్ డ్రైవర్లకు జాతీయ రహాదారిపై నిలబడి పొట్లాలను అందిస్తున్నారు.
సేవలు కొనసాగిస్తాం..
లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలను, డ్రైవర్లను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ఉందని... పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు తమ సేవలను కొనసాగిస్తామని పాలమూరు వాసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు