ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రెండు, మూడు గ్రామాలకు ఒకటి చొప్పున ప్రతి పల్లెకు అందుబాటులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా మహిళా గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 225కు 150 కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశారు.
జిల్లా | ప్రారంభమైన కేంద్రాలు | లక్ష్యం( మెట్రిక్ టన్నుల్లో ) |
జోగులాంబ గద్వాల | 56 | లక్ష |
వనపర్తి | 133 | 2 లక్షలు |
నాగర్ కర్నూల్ | 79 | 2 లక్షల 50 వేలు |
నారాయణపేట | 105 | 78 వేలు |
ముందుగా వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో పర్యటించి కోసిన పంటను పరిశీలించి తేమశాతం ఆధారంగా ఎప్పుడు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వెళ్లాలో టోకెన్లు జారీ చేస్తున్నారు. వారిచ్చిన తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నేరుగా రైతుల కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. లారీలు వెళ్లలేని పరిస్థితి ఉంటే రోడ్డుకు దగ్గర్లో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని ముందే సూచిస్తున్నారు. లేదంటే కళ్లాల నుంచి ట్రాక్టర్లలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కన్నుంచి లారీల్లో తరలిస్తున్నారు. ఎక్కడికక్కడే కొనుగోలు చేయడం వల్ల రైతులు గుమికూడకుండా చేయాలన్నది అధికారుల లక్ష్యం. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు రైతులకు అందుబాటులోనే జరుగుతున్నాయి.
ఐదు జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాల సంఖ్య గతంలో కంటే రెట్టింపు కావడం వల్ల తేమశాతం కొలిచే యంత్రాలు, తూకాలు, గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలో 225 కేంద్రాలకు 150 తేమ యంత్రాలే ఉన్నాయి. తూకం వేసే యంత్రాలు సైతం మరో 100కు పైగా అవసరం ఉన్నాయి. కొనుగోళ్లకు సరిపడా సుమారు 14లక్షల గన్నీబ్యాగులు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 222 కేంద్రాలకు 173 తేమశాతం కొలిచే యంత్రాలున్నాయి. తూకం యంత్రాల కొరత లేదు. 50లక్షల గన్నీబ్యాగులకు 17లక్షలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని సమకూర్చుకోవాల్సి ఉంది.
వనపర్తి జిల్లాలో మాత్రం తేమశాతం కొలిచే యంత్రాలు, తూకాలు, గన్నీ బ్యాగులకు ఎలాంటి కొరత లేదని అధికారులు తెలిపారు. సుమారు 26 లక్షల గన్నీ బ్యాగులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 105 కేంద్రాలకు 75 తేమ శాతం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నవాటినే సర్దుబాటు చేస్తున్నారు. సరిపడా తూకం యంత్రాలున్నాయి. నారాయణపేటలో 15లక్షల గన్నీబ్యాగులు అవసరం ఉండగా.. ప్రస్తుతానికి ఏడున్నర లక్షల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయి.
కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు షానిటైజర్లు లేదా.. చేతులు కడుక్కునేందుకు సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాల్సి ఉంది. అన్నిచోట్ల ఈ ఏర్పాట్లు కనిపించడం లేదు. టోకెన్ విధానం, కళ్లాల్లోనే కొనుగోళ్ల కారణంగా కేంద్రాలకు పెద్దగా రైతులు రావడం లేదు. మరో వారం రోజుల్లో పెద్ద ఎత్తున కోతలు మొదలై ధాన్యం రాక అధికమవుతుంది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద మంచినీరు సహా తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటించిన రైతులకు సాధారణ రకానికి రూ. 1815, సన్న రకానికి రూ. 1835 మద్దతు ధర చెల్లిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ మద్దతు ధరకు ఎలాంటి కోతలు లేకుండా వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే వ్యాపారులకు కూడా రైతులు ధానాన్ని అమ్ముకోవచ్చని ఇప్పటికై ప్రభుత్వం సూచించింది. మద్దతు ధరకు రూపాయి తక్కువ చెల్లించినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రావాలని అధికారులు.. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!