ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల మధ్య ఉన్న ఊకచెట్టు వాగులో చెక్‌డ్యామ్ నిర్మాణానికి రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు భూమి పూజ చేశారు. చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ. 6.89 కోట్ల వ్యయంతో చెక్‌డ్యామ్ నిర్మాణానికి గూరకొండలో భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఆనాడు మద్ధతు తెలిపిన చిన్నారెడ్డి.. నేడు ఎందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు.
చెక్‌డ్యామ్ నిర్మాణంతో రెండు నియోజకవర్గాల మధ్య స్నేహ సంబంధాలు బలపడడం ఆనందదాయకమని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానంపై సానుకూలంగా స్పందిస్తూ.. సాగు చేయాలని ఎమ్మెల్యే రైతులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వ్యవసాయ అధికారులు నియంత్రిత సాగు విధానం చేస్తామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, నారాయణపేట జిల్లా పరిషత్ ఉప చైర్మన్ సురేఖ, ఈ రెండు నియోజకవర్గాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు అధ్యక్షులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం