మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి గృహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. పలువురు మాస్కులు లేకుండా ఉండటాన్ని గమనించిన మంత్రి... కరోనాతో ఆటలాడవద్దని అన్నారు. కరోనా వల్ల ఏదైనా జరగరాని నష్టం జరిగితే కుటుంబం వీధిన పడుతుందని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రారంభంలో 3 నెలలు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నందున పాజిటివ్ కేసులు రాలేదన్నారు. కానీ తర్వాత కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చిందని గుర్తు చేశారు. గ్రామాల్లోని ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించే విధంగా చైతన్యం చేయాలన్నారు. మాస్కు ధరించని వారిపై ఫైన్ విధించాలని ఆయన కలెక్టర్‌కు తెలిపారు.
అర్హులందరికీ రుణాలివ్వాలి...
చిరువ్యాపారులకు రుణాల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆయన పరిశీలించారు. కిరాణా, చాకలి, క్షురక వృత్తి వ్యాపారాల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చినా అందరికీ రుణాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ రుణ మేళా ద్వారా జిల్లాలోని చిరువ్యాపారులు, వీధి వ్యాపారులందరు లబ్ధి పొందాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు సైతం స్వీకరించాలని, ఎస్‌హెచ్‌జీ, మెప్మా మహిళా సంఘాలు ప్రతి ఇల్లు తిరిగి దరఖాస్తులను తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈనెల 13న కేటీఆర్ చేతుల మీదుగా రూ.130 కోట్ల రుణాలు అందించే కార్యక్రమం యథావిధిగా ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ దరఖాస్తులు స్వీకరించటాన్ని ఆయన అభినందించారు. ఆరోవిడత హరితహారంలో భాగంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1278 కరోనా కేసులు