భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లలో ధరణి పోర్టల్ విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా భూమి కొనుగోలుదారులకు సేల్ డీడ్ పత్రాలను అందజేశారు. ప్రపంచంలోనే ధరణి లాంటి పథకం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రిటిష్, నిజాం నాటి చట్టాల వల్ల భూములకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొన్నామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రెండేళ్ల నిరంతర ఆలోచనే ధరణికి రూపమన్నారు. ధరణి ద్వారా కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయి, సేల్ డీడ్ పత్రాలు, పట్టా కాగితాలు రావడమన్నది అద్భుతమైన ఆవిష్కరణ అని వివరించారు. ధరణి వల్ల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు రిజిస్ట్రేషన్ ఎంతో సులువుగా మారిందని, కొన్న వారు, అమ్మిన వారు ఉంటే తప్ప భూముల అమ్మకం, కొనుగోలు సాధ్యం కాదన్నారు.
ధరణి ద్వారా భూములకు భరోసా కల్పించడం జరిగిందని, ప్రస్తుతం భూములు ఎవరు పడితే వారు మార్చుకునే అవకాశం లేనేలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు వారి భూములకు సంబంధించి నిశ్చింతగా ఉండవచ్చని భరోసా ఇచ్చారు. మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, ఆర్డీవో శ్రీనివాసులు, మహబూబ్ నగర్ గ్రామీణ తహసిల్దార్ కిషన్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుశ్రీ రెడ్డి, షహనాజ్ బేగం అనే భూమి కొనుగోలు దారులకు భూమి కొనుగోలు పత్రాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
ఇదీ చదవండి: ధరణిలో మోసాలు జరిగేందుకు ఆస్కారం!