వివిధ కారణాల వల్ల రిజిస్ట్రేషన్ కాని, క్రమబద్దీకరించుకోని ఆస్తులను గుర్తించి... వారి ఆస్తులకు రక్షణ కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్, ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ రిజిస్టర్ కాని ఇళ్ళు, గ్రామ కంఠంలో కట్టుకున్న ఇళ్లు, పట్టా భూముల్లో కట్టుకున్నా రిజిస్టర్ కానివి... అమ్ముకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేదవారికి ఆ ఇబ్బంది లేకుండా, అవసరాల కోసం అమ్ముకునేలా ఈ విధానాన్ని తీసుకువచ్చినట్టు వివరించారు. అందుకే ఆస్తుల వివరాల సేకరణ కోసం అధికారులు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రెవెన్యూ చట్టాన్ని తెచ్చారని తెలిపారు.
ధరణిలో నమోదు కోసమే..
వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు వేర్వేరు పట్టా పాసుపుస్తుకాలు ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నప్పటికీ ప్రజలు పూర్తి సమాచారం అందించాలని, అది మీ భద్రత కోసమేనని మరిచిపోవద్దన్నారు. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని గుర్తించి తమకు సమాచారం అందించాలని... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామకంఠం, అసైన్డ్ భూముల్లో కట్టుకున్నా... అలాంటి వివరాలను కూడా ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల ఆస్తులను ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకే వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు ఉన్నవారు తక్షణమే ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అధికారులకు సహకరించండి..
మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లకు ఈ కార్యక్రమాన్ని అప్పగించి... వారి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? నిర్మాణాలెన్ని ఉన్నాయి? అందులో నెంబర్లు ఉన్న ఇళ్ల వివరాలు? లేని వాటి వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజలు ఆస్తుల లెక్కింపు సందర్భంగా దళారులను నమ్మి మోసపోవద్దని, ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకునేందుకు నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కౌన్సిలర్లు దగ్గరుండి ప్రజలకు సహకరించాలని సూచించారు. గ్రామ, పట్టణాల్లో అస్సెస్మెంట్ చేయవలసిన ఆస్తుల వివరాలు జిల్లా కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. ప్రతి సిమెంటు నిర్మాణాన్ని ధరణి పోర్టల్‌లో ఉంచుతున్నట్టు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ అసెస్మెంట్ కోసం అర్బన్‌లో వారం రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చినట్టు వివరించారు.
ఇదీ చూడండి: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన